Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 28

Viswamitra Celestial weapons to Rama- 2!

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువదితొమ్మిదవ సర్గము
(సిద్ధాశ్రమ వృత్తాంతము - విశ్వామిత్రుని యజ్ఞ దీక్ష)

అథ తస్యా ప్రమేయస్య తద్వనం పరిప్చ్ఛతః|
విశ్వామిత్రో మహాతేజావ్యాఖ్యాతుమ్ ఉపచక్రమే ||

తా|| ప్రమేయములేనివానివలె ఆ వనముగురించి ప్రశ్నించగా అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు విశదముగా చెప్పుటకు ఉపక్రమించెను.

ఇహ రామో మహాబాహో విష్ణుర్దేవవరః ప్రభుః |
వర్షాణి సుబహున్యేవ తథా యుగశతాని చ ||
తపశ్చరణయోగార్థం ఉవాస సు మహాతపాః |
ఏష పుర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః ||
సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహతపాః ||

తా|| 'ఓ రామా ! దేవులలో శ్రేష్ఠుడైన మహావిష్ణువు అనేక వందలయుగములపాటు లోకకల్యాణము కొఱకు తపస్సు చేయుచూ ఇచట నివశించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిపొందుటవలను, అలాగే మహా తపోధనులు ఇచట సిద్ధి పొందుటవలననూ ఈ ఆశ్రమమునకు సిద్దాశ్రమమని ప్రసిద్ధిపొందెన".

ఏతస్మిన్నేవ కాలేతు రాజా వైరోచనిర్బలిః |
నిర్జిత్య దైవతగణాన్ సేంద్రాంశ్చ సమరుద్గణాన్ |
కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః ||
బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః |
సమాగమ్య స్వయం చైవ విష్ణుం ఊచురిహాశ్రమే ||
బలి ర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్ |
అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతామ్ ||
యే చైన మభివర్తంతే యాచితార ఇతస్తతః |
యచ్ఛ యత్ర యథావచ్ఛ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి ||
స త్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రితః |
వామనత్వం గతో విష్ణు కురు కల్యాణ ముత్తమమ్ ||
తా|| 'అదే కాలములో విరోచనుని కుమారుడగు బలి ఇంద్రునితో కూడిన దేవగణములనూ మరుద్గణములనూ జయించి ముల్లోకములకు రాజై పరిపాలించుచుండెన. బలి యజమాన్యములో యజ్ఞము జరుగుచున్నప్పుడు దేవతలందరూ కలిసి అగ్నిని ముందుగా ఉంచుకొని స్వయముగా ఈ ఆశ్రమములో విష్ణువుతో ఇట్లు విన్నవించుకొనిరి. "ఓ మహావిష్ణో ! విరోచనుని పుత్రుడగు బలి ఇచట ఉత్తమమైన యజ్ఞమును కావించుచున్నాడు. ఆక్రతు సమాప్తము అగకుండా మా కార్యము చేయవలసినది ఉన్నది. ఇచటికి అన్నిచోటలనుంచి యాచకులు వచ్చుచున్నారు. వారు కోరినరీతిగా అన్నియూ వారికి ఇవ్వబడుచున్నవి. ఓ విష్ణో ! దేవతల హితముకోసము మాయాయోగము ఆశ్రయించి వానావతారము పొంది లోకకల్యాణము చేయుము'.

ఏతస్మిన్నంతరే రామ కాశ్యపోగ్నిసమప్రభః |
అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా ||
దేవీ సహాయో భగవాన్ దివ్యం వర్షసహస్రకమ్ |
వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్ ||
తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్ |
తపసా త్వాం సుతస్తేన పశ్యామి పురుషోత్తమమ్ ||
శరిరే తవ పశ్యామి జగత్ సర్వమిదం ప్రభో |
త్వమానదిరనిర్దేశ్యః త్వామహం శరణం గతః ||

తా|| అదే కాలములో అగ్నితో సమానమైన తేజస్సు కల కాశ్యపమహాముని తన భార్యయగు అదితో కలిసి వెలుగుచుండెను. ఆ దేవితో కలిసి వేలకొలదీ సంవత్సరములు వ్రతమాచరించి మధుసూదనుని సంతుష్టునిగావించి ఈ విధముగా పలికెను. "ఓ ! పురుషోత్తమా ! నీవు తపోమయుడవు, తపోరాశివి తపోమూర్తివి. అట్టి నిన్ను తపస్సుచే అరాధించి చూచుచున్నాను. ఈ శరీరములో జగత్తునంతయూ చూచుచున్నాను. నీవు అనాద్యంతములు లేనివాడవు.నిన్ను శరణు కోరుచున్నాను".

తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూతకల్మషమ్|
వరం వరయ భద్రం తే వరార్హోsసి మతో మమ ||
తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కాస్యపోsబ్రవీత్ |
అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః ||
వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత |
పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ ||

తా||'సంతుష్టుడైన శ్రీహరి కల్మషములేని ఆ కాశ్యపునితో ఇట్లనెను." ఓ సువ్రత ! వరమును కోరుకొనుము. నేను ఇచ్చెదను . నీవు అందులకు అర్హుడవు". ఆ మాటలను వినిన మరీచి కుమారుడగు కాశ్యపుడు ఇట్లు పలికెను. " అదితి , దేవతలూ నేనూ నిన్ను అర్థించుచుంటిమి. మాకు వరము ప్రసాదింపుము. వరములిచ్చుటకు నీవే తగినవాడవు. ఓ మహాత్మా నాకు అదితికి పుత్రుడుగా జన్మించుము" అని.

భ్రాతా భవ యావీయాం స్త్వం శక్రస్యాసురసూదన |
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి ||
అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్ తే భవిష్యతి |
సిద్ధేకర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః ||

తా|| " ఓ అసురసూదనా ! ఇంద్రునకు తమ్ముడవు కమ్ము. శోకార్తులైన దేవతలకు నీవే సహాయము చేయగలవు. నీ ప్రసాదము వలన ఈ ఆశ్రమము సిద్ధాశ్రమమని పేరుపొందును. ఓ దేవ దేవా నీ అనుగ్రహమువలన మా తపస్సులు సిద్ధి పొందును. భగవన్ లెమ్ము ఇచటికి రమ్ము".

అథ విష్ణు ర్మహాతేజా అదిత్యాం సమజాయత |
వామనం రూప మాస్థాయ వైరోచని ముపాగమత్ ||
త్రీన్ క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః |
అక్రమ్య లోకాన్ లోకాత్మా సర్వభూతహితేరతః ||
మహేంద్రాయ పునః ప్రాదాత్ నియమ్య బలిమోజసా |
త్రైలోక్యం స మహాతేజః చక్రే శక్రవశం పునః ||

తా|| ' అంతట మహాతేజోమయుడైన విష్ణువు అదితియందు జన్మించి, వామనరూపమును పొంది, విరోచనుని కుమారుడగు బలి వద్దకు వచ్చెను. పిమ్మట మూడడుగులు బిక్షగా అడిగి దానమును ప్రతిగ్రహించెను. సమస్త భూతములకూ హితముగూర్చు విష్ణువు అప్పుడు ముల్లోకములలో వ్యాపించి బలిని నిరోధించి మహేంద్రునకు మరల ముల్లోకముల అధిపతి చేసెను. ఈ విధముగా తేజోమయుడైన మహావిష్ణువు ఇంద్రుని అధిపతిగా చేసెను'.

తేనైషా పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః |
మయాsపి భక్త్యా తశ్యైష వామనస్యోపభుజ్యతే ||
ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః |
అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః ||

తా|| 'ఈ విధముగా ఈ ఆశ్రమము పూర్వము పవిత్రత పొందినది, ఈ ప్రదేశము శ్రమను నాశనమొనర్చును. నేను కూడా వామనుపై భక్తిశ్రద్దలతో ఈ ప్రదేశమును ఆశ్రయించితిని. ఈ ఆశ్రమమునకు విఘ్నకారకులగు రాక్షసులు వచ్చుచుందురు. ఓ పురుషవ్యాఘ్రా! ఇచటనే అ దుష్టాచరులను హంతమొనర్చవలయును'.

అద్యగచ్ఛామహే రామ సిద్ధాశ్రమమ్ అనుత్తమమ్ |
తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ ||
ప్రవిశన్నాశ్రమపదం వ్యరోచత మహామునిః |
శశీవ గతనీహారః పునర్వసు సమన్వితః ||

తా|| ' ఓ రామా ఈ దినమే ఉత్తమమైన సిద్దాశ్రమమునకు వెళ్ళుదము. నాయనా! ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు . నీది కూడా!' అప్పుడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము రామలక్ష్మణులతో ప్రవేశించుచూ మంచుతొలగి పునర్వుసు నక్షత్రముతో కూడిన చంద్రునివలె విరాజిల్లెను.

తం దృష్ట్వా మునయః సర్వే సిద్దాశ్రమనివాసినః |
ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రం అపూజయన్ ||
యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే |
తథైవ రాజపుత్రాభ్యాం అకుర్వన్ అతిథిక్రియామ్ ||

తా|| వారి రాకను చూచి సిద్ధాశ్రమవాసులైన మునులందరూ లేచి వెంటనే ముందుకువచ్చి విశ్వామిత్రుని పూజించిరి. వారు ధీమంతుడగు విశ్వామిత్రుని యథోచితముగా పూజించి అట్లే ఆ రాజపుత్రులకు కూడా అతిథి క్రియలను సల్పిరి.

ముహూర్తమథ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ |
ప్రాంజలీ మునిశార్దూలం ఊచతూ రఘునందనౌ ||
అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుంగవ |
సిద్దాశ్రమౌsయం సిద్దః స్యాత్ సత్యమస్తు వచస్తవ ||

తా|| రఘునందనులూ శత్రుభయంకరులగు ఆ రాజపుత్రులిద్దరూ క్షణకాలము విశ్రమించి మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రునకు అంజలిఘటించి ఇట్లు పలికిరి.' ఓ మునీశ్వరా ఈ దినమే దీక్షగైకొనుడు. మీ సంకల్పము నెఱవేరును. ఈ సిద్ధాశ్రమము అను పేరు సార్థకమగును. మీ వచనములు సత్యమగును'.

ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహాన్ ఋషిః |
ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేంద్రియః ||

తా|| ఈ విధముగా చెప్పబడిన మాటలను విని మహాతేజోమయుడైన విశ్వామిత్రుడు నిశ్చల చిత్తుడై నియమ నిష్ఠలతో దీక్షను స్వీకరించెను.

కుమారావపి తాం రాత్రిం ఉషిత్వా సుసమాహితౌ |
ప్రభాతకాలేచోత్థాయ పూర్వాం సంధ్యాం ఉపాస్యచ ||

తా|| ఆ రాజకుమారులు గూడా ఆ రాత్రి ని గడిపి ప్రభాత సమయమున లేచి పూర్వ సంధ్యాకార్యములను నిర్వర్తించిరి.

స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేవ చ |
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతామ్ ||

తా|| శుచిఅయి ఉదకములను స్పృశించి నియమపూర్వకముగా జపములను సమాప్తి చేశిరి. పిమ్మట హుతాగ్ని హోత్రములముందు అశీనులైన విశ్వామిత్రునకి అభివాదమొనర్చిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే ఏకోన త్రింశస్సర్గః ||
సమాప్తం||

|| ఈ విధముగా బాలకాండలో ఇరువదితొమ్మిదవ సర్గము సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||